SIT: ఆ ఇద్దరినీ ఉరి తీయండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని నిర్ధారణ కావడంతో బండి సంజయ్ స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. దాదాపు రెండు గంటల పాటు బండి సంజయ్ ను సిట్ విచారించింది. 45 నిమిషాల పాటు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని సిట్ ప్రశ్నించింది. బండి సంజయ్ అనుచరుడు మధుని సిట్ ప్రశ్నించింది. బండి సంజయ్ మాజీ పీఏ తిరుపతి, పీఆర్వో ప్రవీణ్‌లను సిట్ విచారించింది. ముందుగా ఆయన ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడినుంచి పాదయాత్రగా ఆయన దిల్ కుషా గెస్ట్ హౌస్ కు వెళ్లి సిట్ విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను అందించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్.. పదేళ్బ బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ నే ఎక్కువ ట్యాప్ చేశారని తెలిపారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని... సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని అన్నారు. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను కాపాడుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు ఉన్నప్పటికీ... ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య దోస్తీ ఉంది కాబట్టే అరెస్టులు జరగడం లేదని అన్నారు. ఇదంతా టైమ్ పాస్ వ్యవహారంలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సిట్ వాళ్లు ఫోన్ ట్యాపింగ్ విషయాలు చెబుతుంటే షాకయ్యానని, భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న మూర్ఖులని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కేసీఆర్ బంధువులను కూడా విచారణకు పిలిపించాలని సిట్‌కు చెప్పానని బండి సంజయ్ వెల్లడించారు. ప్రభాకర రావు, రాధా కిషన్ రావులు పెద్ద లఫంగలు అని.. వారిద్దరిని ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
కవిత దంపతుల ఫోన్ ట్యాప్
"కేసీఆర్ కుమార్తె, అల్లుడి ఫోన్లు ట్యాప్ చేశారు. వారినీ విచారణకు పిలవాలి. ఎస్ఐబీని సొంత అవసరాలకు అడ్డాగా కేటీఆర్ మార్చారు. నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా అనేక లావాదేవీలకు సంబంధించి లబ్ధి పొందారు. ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు బాగోతం చెబుతుంటే నాకే సిగ్గనిపించింది. వారిద్దర్నీ సమాజం క్షమించదు. ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారు.. క్షణక్షణం బాధపడాలి. మా కార్యకర్తలను, ఇతర పార్టీ నాయకులను క్షోభకు గురి చేశారు. ఇద్దరు నిందితులను కాపాడే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. వ్యాపారుల లావాదేవీలు తెలుసుకొని కేటీఆర్ బ్లాక్‌మెయిలింగ్ చేశారు." అని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మావోయిస్టుల పేర్లతో తమపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇక ఫోన్ ట్యాప్ అయిన వారి లిస్ట్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ కేసులో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు వివరాలు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com