SIT: హరీష్‌రావుపై సిట్ ప్రశ్నల వర్షం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ కొనసాగుతున్న విచారణలో భాగంగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. దాదాపు ఏడు గంటలపాటు సాగిన ఈ విచారణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఈ కేసు వెనుక రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు. ఈ విచారణలో ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం హరీశ్ రావు నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లగా, అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వాదనను స్పష్టంగా వెల్లడించారు.
మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సంబంధిత భారీ అవినీతి వ్యవహారాన్ని తాను బయటపెట్టినందుకే తనపై ఈ తరహా విచారణలు చేపడుతున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు ప్రతీకార చర్యలుగా ఈ కేసును ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే, సింగరేణి బొగ్గు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయస్థానానికి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రుల మధ్య వాటాల పంపకాల అంశాలు బహిర్గతమవుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనను లక్ష్యంగా చేసుకుని విచారణలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారిందని, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి దండుపాళ్యం ముఠాల్లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్కామ్‌లపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజల సహనం నశిస్తున్నదని, తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటి విచారణకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ వర్గాల నుంచే మీడియాకు లీక్ అయ్యే అవకాశం ఉందని హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా ధైర్యం ఉంటే, తన సిట్ విచారణ వీడియోను పూర్తిగా బయటపెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనకు ఇచ్చే నోటీసులే ప్రభుత్వ పతనాన్ని వేగవంతం చేస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.
సిట్ విచారణలో తాను ప్రశ్నలు ఎదుర్కొన్నానని కాదు, తానే అధికారులను అనేక ప్రశ్నలు అడిగినట్లు హరీశ్ రావు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను హోం మంత్రిగా పనిచేయలేదని, అలాంటప్పుడు ట్యాపింగ్ బాధ్యత తనపై ఎలా వేస్తారని ప్రశ్నించారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలను విచారణకు పిలవాలని తాను సూచించినట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
