CONGRESS: బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌

CONGRESS: బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌
కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు... అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న ఎమెల్సీలు

భారతీయ రాష్ట్ర సమితికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీల సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. బీఅర్ఎస్‌ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైన వారు రాత్రి 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సురేందర్‌రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్సీల చేరిక ప్రక్రియ అంతా చేరికల కార్యక్రమం పూర్తయింది.

ఇప్పటికే ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య ఉన్నారు. ఇప్పుడు బీఅర్ఎస్‌ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ పార్టీ మారారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు భారాసకు దూరం కావడం ఆ పార్టీకి మరింత గట్ట దెబ్బ తగిలింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తారో చూడాలి.




Tags

Next Story