SAD: నగరం నడిబొడ్డున..ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం

సమాజంలో అమాయక చిన్నారులపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, కఠిన చట్టాలు అమల్లో ఉన్నా కూడా కామాంధుల దురాగతాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగర శివారులో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చాక్లెట్ ఇస్తానంటూ ఆశ చూపించి ఆరేళ్ల చిన్నారిని తన వెంట తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేయడం నగరాన్ని కుదిపేసింది. ఈ ఘటన బయటపడిన వెంటనే స్థానికుల్లో ఆగ్రహం చెలరేగింది. చిన్నారి ప్రాణం తీసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు కఠినంగా ప్రశ్నించడంతో అతడు చేసిన ఘోర నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి చిన్నారిని తన వెంట తీసుకెళ్లినట్లు, అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తన నేరం బయటపడుతుందనే భయంతో బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రశ్నించిన పోలీసులు బాలిక ఎక్కడ ఉందని అడగగా, రాత్రి సుమారు ఒకటి గంట ప్రాంతంలో అతడు చూపించిన చోట చిన్నారి మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
