SLBC: ఆ ఎనిమిది మంది ఎలా ఉన్నారో...?

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ చిక్కుకున్న 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అయితే చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. దోమలపెంటలోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు, మూడు గంటల సమయం పడుతుందన్నారు. సమస్య అంతా 100 మిటర్లలోపే ఉందని వివరించారు. నీటితోపాటు బురద అధికంగా ఉందని పేర్కొన్నారు. గత రాత్రి సైతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని చెప్పారు. 8 మంది కార్మికుల రక్షణ కోసమే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. టన్నెల్‌లోనే దాదాపు ఐదు గంటలు పాటు జూపల్లి కృష్ణారావు గడిపారు.
ముమ్మరంగా సహాయ చర్యలు
ఎస్‌ఎల్బీసీ ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. 8మంది బాధితులను క్షేమంగా రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 130 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సొరంగంలో 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..?
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో విపత్తు సంభవించింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతుండగా.. 14వ కిలోమీటరు వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సొరంగం లోపల ఎనిమిది మంది చిక్కుకోగా.. పలువురు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు, ఆపరేటర్లు అయోమయానికి గురయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com