SAD: నవ్వులు పూయాల్సిన ఇళ్లల్లో ఆర్తనాదాలు

సంక్రాంతి పండుగ కొన్ని కుటుంబాల్లో మాత్రం తీరని శోకాన్ని నింపింది. పిల్లాపెద్దలు ఎంతో సంబరంగా ఎగరేసే పతంగులే కొందరి ప్రాణాలు తీయగా గాలిపటం మాంజాతో గొంతు తెగి ఓ జవాన్ మృతిచెందాడు. సంక్రాంతి పండుగ వేళ నవ్వులు పూయాల్సిన ఇళ్లలో ఆర్తనాదాలు వినిపించాయి. గాలిపటం దారం యమపాశమైంది. పతంగుల సరదా ప్రాణాలు తీసింది. సంబురాలు తెస్తుందనుకున్న సంక్రాంతి కొందరికి మాత్రం తీరని శోకాన్ని మిగిల్చింది. పండుగ సందడి మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ అత్తాపూర్‌లోని లక్ష్మీవాణి టవర్స్‌పై తనిష్క్ అనే బాబు గాలిపటం ఎగరేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేట్‌లో పిల్లలంతా పతంగులు ఎగరేస్తుండగా... గాలిపటం విద్యుత్తు తీగలకు చిక్కుకుంది. తీసేందుకు యత్నించిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ క్రమంలో భవనంపై నుంచి కిందపడగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ... అల్వాల్ ASI కుమారుడు ఆకాశ్ మృతిచెందాడు. పతంగి ఎగరేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అటు నాగోల్‌లో జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న శివప్రసన్న అనే బాబు నాలుగంతస్తుల భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా జోహెల్ అనే బాలుడు గాలిపటం ఎగురవేస్తూ... విద్యుదాఘాతానికి గురయ్యాడు. పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పతంగులు ఎగరేసే క్రమంలో ప్రమాదాలకు గురై కొందరు ప్రాణాలు కోల్పోతే ఓ జవాన్ పాలిట మాంజా దారం యమపాశమైంది. విశాఖకు చెందిన చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి... హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని బాపూనగర్‌లో నివాసముంటున్నాడు. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న కోటేశ్వర్.... శనివారం విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా... లంగర్‌హౌస్ ఇందిరారెడ్డి ఫ్లైఓవర్‌పై మాంజాదారం గొంతుకు పట్టుకుంది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కోటేశ్వర్ మృతిచెందారు. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చైనా మాంజాను నిషేధించగా 2017 జులై 11న తెలంగాణ ప్రభుత్వం కూడా మాంజా అమ్మకాలపై నిషేధం విధించింది. అయినా మాంజా అమ్మకాలు ప్రతీ సంక్రాంతి సీజన్‌లో కొనసాగుతూనే ఉన్నాయి. సంక్రాంతి వేళ విద్యుత్ తీగలకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని విద్యుత్‌శాఖ సూచిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగరవేయాలని... పిల్లలు ఆడుకునేందుకు వెళ్లిన సమయంలో తల్లిదండ్రులు సైతం గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గాలిపటాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొనే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com