సొంత పార్టీలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు : జానారెడ్డి

సోషల్ మీడియాలో కొందరు రాజకీయ నాయకుల పట్ల రకరకాల వార్తలు వ్యాప్తి చేస్తూ... అవమానిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్‍లో ఆయన మీడియాతో మాట్లాడారు. అభిమానుల అత్యుత్సాహం పార్టీలో ఐక్యతను దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు.
సొంత పార్టీలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో పరస్పర దుష్ప్రచారాలతో పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. గీత దాటే అభిమానులు, కార్యకర్తలపై పీసీసీ చర్యలు తీసుకోవాలని లేదంటే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
ఇక పీసీసీ నాయకత్వం అంతా సమావేశమై అభిమానులను అదుపులో ఉంచేలా చూడాలన్నారు జానారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి వాడిన భాష సరైంది కాదన్నారు. పార్టీ వేదికలపై ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇక తెలంగాణలో వివిధ హోదాల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెసేనన్నారు. ఈ ఏడేళ్లలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com