CRIME: పట్టపగలు.. నడిరోడ్డుపై తండ్రిని పొడిచి చంపిన కొడుకు

కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగా కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తండ్రి ఆరెల్లి మొగిలిని కుమారుడు సాయికుమార్ ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద చాకుతో విచక్షణారహితంగా 15 సార్లు పొడిచి హత్య చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తిని ఆరెల్లి మొగిలిగా గుర్తించారు. చంపిన వ్యక్తి పేరు సాయికుమార్. వీరిద్దరూ తండ్రీ కొడుకులు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి, అతని కుమారుడు సాయి కుమార్ ఇద్దరూ కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. అయితే తండ్రి మొగిలి మద్యానికి బానిసయ్యాడు. వచ్చే డబ్బులు మెుత్తం తాగుడుకు ఖర్చు పెడుతూ ప్రతి రోజూ ఇంట్లో గొడవకు దిగేవాడని చెబుతున్నారు. తాగి గొడవ చేయవద్దని కుమారుడు సాయికుమార్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని.. దాంతో తండ్రిపై కోపం పెంచుకున్నాడని చెబుతున్నారు.
బస్సులో వెళ్తూంటే వెంటపడి మరీ నరికివేత
తండ్రి ఇలాగే వ్యవహరిస్తే పరువుపోతుందని అనుకున్నాడు. తీరు మార్చుకోకపోతే చంపేస్తానని హెచ్చరించినా మారలేదు. రెండు రోజుల కిందట.. మొగిలి మద్యం తాగి గొడవ చేయడంతో ఇక చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి నుంచి మొగిలి ఆర్టీసీ బస్సులో బయలుదేరగా.. అతడిని సాయి కుమార్ తన బైక్‌పై వెంబడించాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద తండ్రి మెుగిలి బస్సు దిగగా.. ఆ వెంటనే కత్తితో విచక్షణారహితగా పొడిచాడు.
పోలీసుల అదుపులో కుమారుడు
తండ్రి మెుగిలి తప్పించుకునే ప్రయత్నం చేసినా వదిలి పెట్టలేదు. వెంబడించి వేటాడి దారుణంగా పొడిచి చంపాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు. సాయికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని మొత్తం పదిహేను సార్లు పొడిచినట్లుగా గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com