Congress: పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ..

Congress: పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ..
తీర్మానం ప్రతిపాదించిన రేవంత్‌ రెడ్డి

పార్లమెంట్‌ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ PCC తీర్మానించింది. బుధవారం ఇందిరాభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పీసీసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కారక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు సూచించారు

పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించడమే ప్రధాన అజెండాగా పీసీసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం సాగింది. పార్టీ రాష్ట్ర నూతన ఇన్‌ఛార్జిగా నియమితులైన దీపదాస్‌మున్షీని సీఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు సత్కరించారు. సమావేశం ఆరంభంలో గ్యారంటీ హామీలఅమలు, పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించి, సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు మరింత శ్రమించాలని దీపదాస్‌మున్షీ ఉద్బోధించారు. హైదరాబాద్‌లో బోగస్‌ ఓట్లు చాలా ఉన్నాయని.... నాయకులు ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పని చేయాలని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి పీసీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఐతే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం AICC నిర్ణయమని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.

గతప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేసిందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆర్థికంగా బలోపేతమవుతూనే.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తామని చెప్పారు. పార్టీకోసం కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించారని వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందనిమంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. కొన్ని నెలలు కష్టపడితే పార్లమెంట్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం విజయవంతమైందని... రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ హామీలు అమలయ్యే తీరు చూసి భారాస నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామన్న నేతలు ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story