పొలిటికల్ ఎంట్రీ పై గంగూలీ క్లారిటీ..!
బెంగాల్ టైగర్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తారా? మోదీ సమక్షంలో బీజేపీ జెండా కప్పుకుంటారా? వచ్చే ఆదివారం మోదీ పాల్గొనే మెగా బీజేపీ సభకు గంగూలీ హాజరవబోతున్నారా? బెంగాల్ అంతటా ఇదే చర్చ జరుగుతోంది. వెళ్తాడని కొందరు.. అలా జరగదని మరికొందరి వాదిస్తున్నారు. ఈ సందేహాలకు, రకరకాల చర్చలకు చెక్ పెడుతూ గంగూలీనే స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్తారా అని ప్రశ్నించగా.. తాను ఓ క్రీడాకారుడినని.. క్రీడలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండని బదులిచ్చాడు. అందరూ అన్ని పాత్రలు చేయలేరంటూ చెప్పారు. దీనర్ధం.. తాను క్రికెటర్‌ని మాత్రమేనని పొలిటీషియన్‌ను కాదని చెప్పకనే చెప్పారు.
గంగూలీ రాజకీయరంగ ప్రవేశంపై సీపీఎం లీడర్, సౌరవ్ స్నేహితుడు అశోక్ భట్టాచార్య కూడా క్లారిటీ ఇచ్చాడు. గంగూలీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా లేడని చెప్పారు. నిజానికి అమిత్‌షా కుమారుడు జేషా బీసీసీఐ సెక్రటరీగా అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పటి నుంచి.. గంగూలీ బీజేపీ జాయిన్ అవుతారన్న చర్చ నడుస్తూనే ఉంది. పైగా మొన్న మోతేరా స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను గంగూలీ పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ కారణంతోనే వచ్చే ఆదివారం మోదీ సభకు గంగూలీ హాజరవుతారని బీజేపీ శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. అందుకే, గంగూలీ స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన తరువాత కూడా బీజేపీ నేతల్లో ఆ ఆశలు పోలేదు. ఒకవేళ గంగూలీ ర్యాలీలో పాల్గొనాలనుకుంటే, ఆయన ఆరోగ్య పరిస్థితి అనుకూలిస్తే, స్వాగతం పలుకుతామని బీజేపీ అధికార ప్రతినిధి శామిక్ భట్టాచార్య స్టేట్‌మెంట్ వదిలారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com