తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ధృవీకరించింది. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. మరికొన్ని గంటల్లో ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని తెలియజేసింది. దీని ప్రభావంతో అక్కడక్కడే జల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడే అవకాశాముందని ఐఎండీ వెల్లడించింది.
మరోవైపు... తెలంగాణలో రాగల 3రోజుల్లోనూ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ , రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందంన్నారు అధికారులు. నైరుతి రుతుపవనాలు కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిచాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com