TG : కార్తిక మాసంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

కార్తిక మాసంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ పనితీరు, కార్తికమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం) తదితర అంశాలపై హైదరాబాద్ బస్‌భవన్ నుంచి ఉన్నతాధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి కార్తిక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ నెల 15న కార్తిక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. ఏపీలోని పంచారామ క్షేత్రాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com