Khammam: పరిహారం తేల్చకుండా ప్రాజెక్టు పనులు
గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పడుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది. అయితే..తమ జీవనాధారమైన విలువైన భూములు కోల్పోతున్నా..పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి స్పష్టత లేకుండానే పనులు చేపడుతున్నారంటూ భూనిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని పంటల సాగుకు నీళ్లందించాలనే లక్ష్యంతో సీతారామా ప్రాజెక్టు పనులు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజైన్‌లో కొంత మార్పులు చేసి... సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి కాకుండా మధ్యలోనే ప్రత్యేకంగా అనుసంధాన కాలువ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 100 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు చేపట్టింది. జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి ఏన్కూరు సమీపంలో NSP సాగర్ కాలువ వరకు కాలువ తవ్వకానికి ప్రతిపాదన చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుండటం, స్వయంగా కాలువల నిర్మాణం పనులు పరిశీలించి దిశానిర్దేశం చేస్తుండటంతో..పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి..
ఓ వైపు సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింకు కెనాల్ పనులు చకచకా సాగుతున్నప్పటికీ.. భూములిచ్చిన రైతులకు మాత్రం ఇంకా పరిహారం నిర్ణయించడంలో ఆలస్యం అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శంకుస్థాపన పూర్తికాగానే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ప్రకటించడంలో ఆలస్యమయింది. పరిహారం ప్రకటించకుండా వర్షాలు వస్తాయని పనుల్లో హడావుడి చేయడంతో రైతులు అడ్డుకున్నారు. ఏన్కూరు సమీపంలో తమకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే కాలువ తవ్వుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు..తమ ఆవేదనను అర్థం చేసుకుని న్యాయపరమైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

