muchintal : ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్‌ దివ్యసాకేతం

muchintal : ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్‌ దివ్యసాకేతం
muchintal : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాక్రతువులో భాగంగా యాగశాలలో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు. 5 వేల మంది రుత్విజులు వేదమంత్రాలు చదువుతుండగా స్వచ్ఛమైన ఆవునెయ్యితో హోమ క్రతువును నిర్వహించారు. సృష్టి దివ్య ప్రబంధాలు, భగవద్గీతలోని ప్రధాన అధ్యయనాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉజ్జీవన యజ్ఞం పూర్తిచేశారు. విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టిని నిర్వహించారు. ఉదయం సామూహిక ఉపనయనాలు చేశారు.

ప్రవచన మండపంలో అహోబిల రామనుజజీయర్‌ స్వామి భక్తులతో శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళిపూజను నిర్వహించారు. రామచంద్ర జీయర్‌ స్వామి భక్తులతో పూజను చేయించారు. సుమారు రెండు వేల మంది భక్తులు పూజలో పాల్గొన్నారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో 108 దివ్యదేశాలలోని 36 ఆలయాలకు త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ప్రత్యక్షపర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రాణప్రతిష్ఠ జరిగింది. మరికొన్ని ఆలయాలకు ఈనెల 13న ప్రాణప్రతిష్ట జరగనుంది.

216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సమతా విగ్రహాన్ని దర్శించుకుని పరవశించిపోతున్నారు. మైసూరు దత్త పీఠం అవధూత గణపతి సచ్ఛిదానంద రామనుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. గణపతి సచ్చిదానందకు సమతామూర్తి ప్రాంగణం విశేషాలను చిన్నజీయర్‌ వివరించారు. అనంతరం యాగశాలకు చేరుకుని శ్రీ లక్ష్మీనారాయణ మహా క్రతువులో పాల్గొన్నారు. పూర్ఱాహుతి కార్యక్రమంలో పాల్గొని యజ్ఞ ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందతో సన్నిహిత సంబంధాలను చిన్నజీయర్‌ గుర్తు చేసుకున్నారు.

దివ్యసాకేతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది పదోరోజు వేడుకలకు వీవీఐపీలు, వీఐపీలు తరలివచ్చారు. ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్‌ బాబాతో పాటు తమిళనాడు గవర్నర్‌ దంపతులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సినీ స్టార్‌ అల్లు అర్జున్‌తో పాటు పలువురు దివ్యసాకేతం సందర్శించారు. 108 దివ్యదేశాలలలోని ఆలయాలను, యాగశాలలను, సమతా విగ్రహాన్ని సందర్శించారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ వేదపండితులు రామ్‌దేవ్‌ బాబాకు ఆశీర్వచనం చేశారు.

యజ్ఞశాల పరిసరాల్లోనూ, ప్రవచన మండపంలోనూ, భగవద్‌ రామానుజుల సమతామూర్తి ప్రాంగణంలోనూ జరుగుతున్న నృత్య ప్రదర్శనలు, కోలాటాలు భక్తులను కట్టి పడేస్తున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబచేసే అనేక కళారూపాలు, పురాణ పురుషులు, విచిత్ర వేషధారణలు ఎంతగానే ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచన మండపంలో పొన్నాల వెంకటేశ్ రామానుజ భజన గీతాలు ఆలపించారు. ఉభయ వేదాంతాచార్యులు కందాడై శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యుల వైభవంపై ప్రవచనం అందించారు. విజయనగరం జిల్లా గంట్యాడ నేత్రవిద్యాలయ విద్యార్థులు రామానుజ నూతందాది కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి భావన గీతాలాపన, బిందు బృందం కూచిపూడి నృత్యం, సురభి రాయలవారి బృందం రామానుజాచార్యుల నాటకం, వారాహరి నృత్య అకాడమీకి చెందిన ఆదిలక్ష్మి బృందం కూచిపూడి నృత్యం, శ్రీదేవి సిస్టర్స్‌ గానం, జ్వాలాముఖి నృత్యం, యుగంధర్ స్వామీ గానం, చిరంజీవి ఆమోద్‌ భగవద్గీత శ్లోకాలు ఆకట్టుకున్నాయి.

తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫణిస్వామి నేతృత్వంలో సహస్ర కూచిపూడి అభినయం ఆకట్టుకుంది. 2 వేల మంది చిన్నారుల కూచిపూడి నృత్యం అందరినీ కట్టిపడేసింది.

Tags

Read MoreRead Less
Next Story