TS: తెలంగాణలోనూ ఘనంగా శ్రీరామ శోభాయాత్ర
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకుని రాష్ట్రంలో పలు చోట్ల భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు వినూత్నంగా రామమందిర నామూనాలను తయారు చేసి భక్తిని చాటారు. రామనామ స్మరణతో భారతావని పులకించిపోతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు 20 వేల నాణేలతో 10అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో రూపొందించిన అయోధ్య రామ మందిరం చూపరులను ఆకట్టుకుంటోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో.. ఓ యువతి సీతారామాంజనేయస్వామి చిత్రాలను ముగ్గురూపంలో వేసి అందరి దృష్టి ఆకర్షించింది. రావి ఆకులపై ఆంజనేయుడి ఆకారం, దేవతామూర్తులను తీర్చిదిద్దింది.
నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీకి చెందిన ఓ యువతి... న్యూస్ పేపర్లు, ఫెవికల్ సాయంతో అద్భుతంగా రామమందిర నమూనాన్ని తయారు చేసింది. నిర్మల్ జిల్లా గాంధీచౌక్‌కు చెందిన నరసింహ.... అట్టముక్కలు, పాత క్యాలెండర్లు, పత్రికలు, కాగితాలతో అబ్బురపడేలా రామమందిరం స్తంభాలు, గోపురాలను తయారు చేశారు. యాదాద్రి భువవగిరి జిల్లా మోత్కుర్ మున్సిపాలిటీకి చెందిన 12 ఏళ్ల బాలుడు.....ధర్మాకోల్ సహాయంతో అయోధ్య రామమందిరాన్ని తీర్చిదిద్దారు. మంథని అయ్యప్ప దేవాలయంలో... అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ శివరామకృష్ణ ముగ్గుతో సీతారాములను చిత్రీకరించారు. సికింద్రాబాద్‌లోని హనుమాన్ దేవాలయానికి వచ్చిన సినీనటి పూనమ్ స్వామివారికి మగ్గంపై పట్టు వస్త్రాలు నేశారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేళ... తెలంగాణలో భక్తులు వేడుకల్ని నిర్వహించారు. భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు. భద్రాచలంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామివారి ఆలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు జయరాం జయరాం అంటూ భక్తులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేశారు. సిద్ధిపేట, మహబూబాబాద్‌లో శోభా యాత్రను నిర్వహించారు. హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్శిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని... మంచిర్యాల జిల్లా చెన్నూరులో భక్తులు రామనామ సంకీర్తనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. కాషాయ జెండాలను పట్టుకోని జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com