Sri Lalitha Vidya: ఘనంగా 'శ్రీ లలితావిద్య' ఆవిష్కరణ

Sri Lalitha Vidya (tv5news.in)

Sri Lalitha Vidya (tv5news.in)

Sri Lalitha Vidya: శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం అనేది ఓ శాస్త్రమని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చెప్పారు.

Sri Lalitha Vidya: శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం అనేది ఓ శాస్త్రమని, ఉపాసనా రహస్యాలతో కూడుకున్న ఉపనిషద్విజ్ఞానమని 'సమన్వయసరస్వతి', బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చెప్పారు. అనేక భాష్యాలను, శాస్త్రాలను అధ్యయనం చేసి తాను 'శ్రీ లలితావిద్య'ను రచించానని తెలిపారు. ఈ పుస్తక రచనకు గురువుల కృపతోనూ, దేవీ ప్రేరణతోనూ స్ఫురించిన భావాలను మేళవించినట్లు తెలిపారు. ధర్మ, భక్తి, జ్ఞాన సంస్కారాలతో అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు. ఈ పుస్తకాన్ని కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్‌లో ఆవిష్కరించారు.

ఋషిపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ జ్యోతి ప్రజ్వలన, గ్రంధ పూజతో ప్రారంభమైంది. అనంతరం నూతి లక్ష్మిప్రసూన బృందం 'వందే శ్రీ మాతరం' నృత్య రూపకాన్ని ప్రదర్శించింది. రాజమహేంద్రవరానికి చెందిన 'భాగవత విరించి' డాక్టర్ టీవీ నారాయణ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కాంచీపురం కంచి కామకోటిపీఠం శ్రీకార్యం ఏజెంట్, చల్లా విశ్వనాథశాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని 'శ్రీ లలితావిద్య'ను ఆవిష్కరించారు. చెన్నైకి చెందిన 'జ్ఞానానందనాథ' గోటేటి శ్రీనివాసరావు ప్రథమ ప్రతిని స్వీకరించారు.

డా. టి.వి. నారాయణరావు మాట్లాడుతూ.. 'శ్రీ లలితావిద్య' అందుబాటులోకి రావడం తెలుగువారి అదృష్టమని చెప్పారు. శ్రీ లలిత సహస్ర నామాలకు అనేక మంది అనేక భాష్యాలను రచించారని చెప్పారు. లలితా దేవీ వైభవాన్ని వివరించడంలో అవన్నీ వేటికవే ప్రత్యేకమైనవని, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ రాసిన 'శ్రీ లలితావిద్య' విలక్షణమైనదని తెలిపారు. వాగ్దేవతలు పలికిన రహస్య నామాలలోని గూఢార్థాలు మస్తిష్కంలోకి వెళ్లి, హృదయాలను తాకి, అమ్మవారి భావనలో లీనమయ్యే విధంగా ఈ పుస్తకం ఉందన్నారు.

విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. ఈ గ్రంథాన్ని సాక్షాత్తూ లలితా దేవికి అక్షర రూపంగా వర్ణించారు. అమ్మవారి అరుణ ప్రభలు పుస్తకంపై ముఖచిత్రంలోనూ, ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క నామాన్ని చదువుతూ, భావిస్తూ అమ్మవారి భక్తిలో ఓలలాడవచ్చునన్నారు. ప్రథమ ప్రతి స్వీకర్త శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ గ్రంథం లలితా దేవి చరిత్ర, నామ వైశిష్ట్యంతో అద్భుతంగా ఉందన్నారు. లలితా దేవి రహస్య నామాలలో దాగి ఉన్న శ్రీ విద్య రహస్యాలు సామాన్యుడి నుంచి పండితుల వరకు అర్థం చేసుకుని, దివ్యత్వాన్ని అనుభవించేలా ఉన్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story