Sri Rama Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి అభివృద్ధికి మంత్రి భరోసా..

Sri Rama Navami 2022: దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదభిరాముని కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రెండు గంటల పాటు నిర్వహించిన రాములోరి కల్యాణ వేడుకతో భద్రాద్రి పులకించింది. రెండేళ్ల తర్వాత వేలాది భక్తుల నడుమ మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగవైభవంగా నిర్వహించారు.
ప్రభుత్వం తరపున స్వామి వారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కిన శ్రీ సీతారామచంద్రస్వామి... మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం , అభిజిత్ లగ్న సుముహూర్తాన సీతమ్మ మెడలో తాళి కట్టారు. రాబేయే రోజుల్లో భద్రాద్రి ఆలయాన్ని 150కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 100కోట్లు కేటాయిస్తారన్నారు. భద్రాచలం, వేములవాడ, బాసర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారన్నారు.
వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం పదిన్నర గంటలకు అభిజిల్ లగ్న సుముహూర్తమున స్వామివారి కల్యాణం నిర్వహించారు. వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాకినాడ జిల్లా ములగపూడి శ్రీరామగిరిలో అత్యంత వైభవంగా శ్రీకోందడ రామస్వామి కల్యాణమహోత్సవం జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్బంగా తిరుపతిలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. టీటీడీ ఆధ్వర్యంలోని కోదండ రామాలయం భక్తులతో పోటెత్తింది. భాగ్యనగరంలో వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు కనులపండువగా సాగాయి. హైదరాబాద్ మాదాపూర్ భక్తాంజనేయ కోదండరామలింగేశ్వర నవగ్రహ గణపతి దేవస్థానంలో శ్రీరామ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com