MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి

MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఎంజీఎంలో ఘటన తరువాత మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ అర్ధరాత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిమ్స్ ఐసీయూలో ఉంచి శ్రీనివాస్‌కు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.
అయితే చికిత్సకు బాధితుడి శరీరం సహకరించక తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉన్న తమకు.. భర్త మృతితో రోడ్డునపడ్డామని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
కిడ్నీ, లివర్ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్‌కు చికిత్స కోసం...వరంగల్ ఎంజీఎంకు వస్తే... ఆస్పత్రిలో ఎలుకలు కొరికాయి. రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు కాళ్లు, చేతులు కొరికినట్లు తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం... ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు వైద్యులపైనా చర్యలు తీసుకొంది.
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ఎలుకల కారణంగా ప్రాణాల మీద ఆశలు లేకుండా పోతోంది. ఎలుకల దాడి ఘటనతో రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎవరిని తట్టినా ఎలుకల విషయమే చర్చించుకుంటున్నారు. ఐసీయూ సహా ఇతర వార్డుల్లోనూ ఎలుకలు యథేచ్చగా తిరుగుతున్నాయని తెలిపారు. రోగికి సంబంధించి ఇద్దరు కుటుంబ సభ్యుల్లో ఒకరు పడుకుంటే మరొకరు కాపాలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com