SRISAILAM: శ్రీశైలం గేట్లు ఓపెన్‌.. పర్యాటకుల రాకతో కళకళ

SRISAILAM: శ్రీశైలం గేట్లు ఓపెన్‌.. పర్యాటకుల రాకతో కళకళ
X
నాగార్జున సాగర్‌ వైపు వరద పరుగు... ఆవిష్కృతమైన సుందర దృశ్యం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మొత్తంఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌ వైపు ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. శ్రీశైలం జలాశయం స్పిల్‌ వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4.27 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.7 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 202.9 టీఎంసీలుగా నమోదైంది.

కుడిగట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 25,684 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటితో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా చేసి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు శ్రీశైలం జలాశయం డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలం బాటపడుతున్నారు. మరో వైపు రిజర్వాయర్‌కు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లొద్దని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. టూరిజంశాఖ అధికారులకు, మత్స్యకారులకు నోటీసులు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు పడవలు నడపొద్దని సూచించారు.

Tags

Next Story