Srisailam: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాల వివరాలివే ..

Srisailam: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాల వివరాలివే ..
X
సేవలు, దర్శనాలపై కీలక ప్రకటనలు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు షాకిచ్చారు. కార్తీక మాసం వస్తుండటంతో ఆర్జిత సేవలు, దర్శనాల్లో మార్పులు చేశారు. నవంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు కార్తీక మాసం కాగా.. శ్రీశైలానికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు కార్తీక మాసం రద్దీ రోజుల్లో సామూహిక అభిషేకాలు, వృద్ధ మల్లికార్జున స్వామివారి బిల్వార్చన, అభిషేకాలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

కార్తీక మాసంలో వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలైన ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఆ రోజుల్లో భక్తులందరికీ అలంకార దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమ్మవారి ఆలయంలోనూ శ్రీచక్ర కుంకుమార్చనలు ఆలయ ఆశీర్వచన ప్రాకార మండపంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. మామూలు రోజుల్లో మూడు విడతలుగా ఉండే స్పర్శదర్శనాల కోసం ఆన్‌లైన్‌లో టికెట్స్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు ఆలయ అధికారులు. కార్తీక మాసం రద్దీ రోజుల్లో రూ.500 టికెట్టు ఉన్నవారికి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.

భక్తులు srisailadevasthanam.org వెబ్‌సైట్, శ్రీశైల దేవస్థానం అఫీషియల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సేవా టిక్కెట్లు, స్పర్శ దర్శనం టికెట్స్‌ను బుక్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. మరోవైపు ఇక వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, స్వామిఅమ్మవార్ల లీలాకళ్యాణం యథావిధిగా జరుగనుండగా.. రుద్ర, మృత్యుంజయ, చండీహోమాలు మాత్రం రెండు విడతలుగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు శ్రీశైల టీవీ ఛానల్‌ ద్వారా ప్రసారమయ్యే పరోక్షసేవలలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు అధికారులు. భక్తులు ఈ విషయాలను గమనించి.. అందుకు తగిన విధంగా శ్రీశైలం వచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

మరోవైపు శ్రీశైలం దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సిద్ధమవుతోంది. ఏపీతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఇంఛార్జ్ ఈవో ఈ చంద్రశేఖర్‌రెడ్డి కార్తీక మాసానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారత్‌ పెట్రోల్‌ బంక్‌, మల్లికార్జున సదన్‌, గణేశసదన్‌, అన్నప్రసాద వితరణ ఎదుట ఉన్న పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు.

కార్తీక మాసంలో ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన వితరణకు ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. అన్నదాన వితరణకు నాణ్యమైన కూరగాయలను తెప్పించాలని.. ఏ రోజు ఏం పెడుతున్నారో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాదు సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలని.. భక్తులతో మర్యాదగా మెలగాలని సూచించారు. భక్తులకు వసతి గదులు కేటాయించే సందర్భంలో ఆధార్‌కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.

Tags

Next Story