Telangana News: తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్‌’ శాటిలైట్‌ సెంటర్‌

Telangana News: తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్‌’ శాటిలైట్‌ సెంటర్‌
ప్రభుత్వంతో భాగస్వామ్యంతో శాటిలైట్ సెంటర్‌పై ఆసక్తి

తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్ని­యాలో ఉన్న స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో స్టాన్‌ఫోర్డ్‌ బయోడిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌ఫోర్డ్‌ బైర్స్‌ సెంటర్‌ ఫర్‌ బయోడిజైన్‌ విభాగం సీనియర్‌ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా స్టాన్‌ఫోర్డ్‌ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్‌ ఆవిష్కరణలను తెలంగాణలో విద్య, ఆరోగ్య రక్షణ విభాగాలకు అనుసంధానం చేయాలనే ఆలోచనను వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ పంచుకున్నారు.

తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, న్యూ లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని స్టాన్‌ఫో­ర్డ్‌ వర్సిటీని రాష్ట్ర బృందం ఆహా్వనించింది. అధునాతన పరిజ్ఞానం మారి్పడి, ఉమ్మడి పరిశోధనలపైనా చర్చించింది. ఈ సందర్భంగా స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ తెలంగాణతో కలిసి పనిచేస్తుందని బయోడిజైన్‌ విభాగం అధిపతులు అనురాగ్‌ మై­రాల్, జోష్‌ మాకోవర్‌ ప్రకటించారు. తమ ఆసక్తి­ని వ్యక్తం చేస్తూ సీఎం బృందానికి లేఖ ఇచ్చారు. వైద్య, విద్య పరికరాలు, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీతో భాగస్వామ్యం తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని సీఎం రేవంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

గూగుల్‌ కార్యాలయానికి ...

వర్సిటీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్‌ బృందం కాలిఫోర్నియాలోని మౌంటేన్‌ వ్యూలో ఉన్న గూగుల్‌ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణలో టెక్‌ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్‌ సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది.

సీఎం రేవంత్‌ కాలిఫోర్నియాలో ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెంట్, రచయిత, వక్త ప్రొఫెసర్‌ రామ్‌చరణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్‌ ప్రత్యేకతలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆహా్వనించారు. వేగంగా మారుతున్న వాణిజ్య వాతావరణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై వారు చర్చించారు. ప్రొఫెసర్‌ రామ్‌చరణ్‌ పలు అంతర్జాతీయ కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలసి పనిచేశారు.

Tags

Next Story