పౌల్ట్రీ రంగానికి సమ్మర్ ఎఫెక్ట్.. పెరిగిన చికెన్ ధరలు

పౌల్ట్రీ రంగానికి సమ్మర్ ఎఫెక్ట్.. పెరిగిన చికెన్ ధరలు
జూన్ నెల వచ్చి పదిహేను రోజులు అవుతున్నా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు..

జూన్ నెల వచ్చి పదిహేను రోజులు అవుతున్నా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు.. వడదెబ్బ తగిలి జంతువులు, పక్షులు మరణిస్తున్నాయి. తెలంగాణలోని అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫల్ట్రీ ఉత్పత్తి భారీగా తగ్గింది. దాణ ఖర్చులు పెరగడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత మూడు రోజులుగా లైవ్ కోడి ధర కిలో రూ.195కి చేరగా మాంసం రూ.290, స్కిన్ లెస్ ధర రూ.320కి చేరుకుంది. ఏప్రిల్ లో కిలో చికెన్ ధర రూ.150 ఉండగా, రెండు నెలల్లో ధర రెట్టింపు అయింది.

ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంది. వేడిమిని తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయి. అకాల వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. వాతావరణ పరిస్థితుల్లో ఈ ఆకస్మిక మార్పు పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. కూలర్లు, ఏసీలు పెడితే కానీ కోడిపిల్లలు బతికే పరిస్థితి కనిపించడం లేదు. నీటి వనరులు లేక పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించారు.

రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో వేసవిలో కోళ్ల ఉత్పత్తి 32 శాతం మేర తగ్గింది. మరణాల రేటు 14 శాతంగా నమోదయింది. దుకాణాలకు కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు చికెన్ ధరలను పెంచుతున్నారు. తెలంగాణలో వెయ్యికి పైగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోడి మాంసం, గుడ్లకు డిమాండ్ భారీగా ఉంటుంది. కోళ్ల ఫారాల సంఖ్య ఏటా పెరుగుతున్నా వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శీతాకాలం, వర్షాకాలంలో కోళ్లు, గుడ్ల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. వేసవిలో కోళ్ల పెంపకం తక్కువగా ఉంటుంది.

Tags

Next Story