Hyderabad: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు.. అప్పుడే 36 డిగ్రీలు

రాష్ట్రంలో అప్పుడే భానుడు భగ్గుమంటున్నాడు. శీతాకాలం సీజన్ పూర్తిగా ముగియకముందే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్‌లో మాడ చుర్రుమనేలా ప్రతాపం చూపుతున్నాడు. నగరంలో మంగళవారం 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం.. కాప్రా, సరూర్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌తో సహా అనేక ఇతర ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం నగరంలో 35.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. వేడిగాలులు వీస్తున్నాయి. రాత్రి పూట 22 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత తగ్గింది.
గతేడాదితో పోలిస్తే కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 16.5 డిగ్రీలు ఉండాల్సి ఉండగా..21 డిగ్రీ నమోదైంది. మారేడ్‌పల్లిలో 2023 ఫిబ్రవరి 6న 14.7 డిగ్రీలు ఉండగా, ఇప్పుడు 19.3 డిగ్రీలుగా రికార్డయింది. మంచిర్యాల జిల్లాలో గత ఏడాది 9.5 డిగ్రీలు ఉండగా.. ప్రస్తుతం 20.3 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 7.5 డిగ్రీలు ఉండగా, ప్రస్తుతం 18.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.0 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఐఎండీహెచ్ అంచనా వేసింది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరవచ్చని, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com