Tamilisai Soundararajan : నన్ను కాకపోయినా .. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి : తమిళిసై

Tamilisai Soundararajan : తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ భగ్గుమన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై….. ఇటీవలి పరిణామాలపై సూటిగా, చాలా ఘాటుగా స్పందించారు. అన్నీ ప్రజలకు తెలుసు అంటూనే.. తాను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.
తాను రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ, ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలనే ప్రయత్నిస్తున్నానని, కానీ జరుగుతోన్నది ఏంటో అందరు చూస్తున్నారని అన్నారు. తాను ఎవరికీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రధానంగా వివిధ సందర్భాల్లో ప్రొటోకాల్ పాటించకపోవడాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు.
తనకు ఇగో లేదని.. ప్రజలకు మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడాన్ని కూడా ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఏం జరుగుతోందో తనకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ విరుచుకుపడ్డారు.
తాను వివాదాస్పద వ్యక్తిని కాదని ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు తమిళిసై. తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ని అని, పారదర్శకంగా పనిచేస్తానని వివరించారు. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ పదవులను సేవారంగంలో వారితోనే భర్తీ చేయాలని.. అప్పుడు ప్రభుత్వ సిఫార్సులు అందుకు తగ్గట్టు లేవు కాబట్టే ఆ ఫైల్‌ను తిరస్కరించానని పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి పేరు ఆమోదించే విషయంలో నాటి పరిణామాల్ని ప్రస్తావించారు. ప్రభుత్వం తనను కాకపోయినా గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి కదా అని సూటిగా ప్రశ్నించారు. చెప్పినట్టు చెయ్యకపోతే గవర్నర్‌ను అవమానిస్తారా అంటూ ఫైరయ్యారు.
కోవిడ్ సమయంలో తాను ప్రభుత్వానికి విలువైన సూచనలు చేశానని, గిరిజన ప్రాంతాల్లో పర్యటించానని కూడా గుర్తు చేశారు. తాను ఫ్రెండ్లీ గవర్నర్‌గానే ఉంటానని, తనకు ఇగో లేదని పునరుద్ఘాటించారు. MLCల ఫైల్, బడ్జెట్ సెషన్‌లో ప్రసంగం, యాదాద్రి పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఇలా అన్నింటిపైన సూటిగానే నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com