Tamilisai Soundararajan : హన్మకొండ ఘటనపై ఆరా తీసిన గవర్నర్‌ తమిళిసై

Tamilisai Soundararajan :  హన్మకొండ ఘటనపై ఆరా తీసిన గవర్నర్‌ తమిళిసై
Tamilisai Soundararajan : హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించాలని వెంటపడుతూ.. ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది.

Tamilisai Soundararajan : హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించాలని వెంటపడుతూ.. ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వేధించాడు అజహర్ అనే వ్యక్తి. ప్రేమను తిరస్కరించడంతో కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటన హన్మకొండలోని పోచమ్మ గుడి దగ్గర జరిగింది. ప్రస్తుతం అనూష పరిస్థితి నిలకడగానే ఉన్నా.. గొంతు కోయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

నర్సంపేట సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష.... కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లిదండ్రులతో కలిసి పోచమ్మకుంట సమీపంలో నివాసం ఉంటోంది. మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్‌... కొంత కాలంగా ప్రేమించాలంటూ అనూషను వేధిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న అతను... యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అనూష చనిపోయిందని భావించిన అజార్‌... అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పేరేంట్స్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనూష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. గొంతుకు లోతుగా గాయం కాలేదని తెలిపారు.

విషయం తెలుసుకున్న విద్యార్థి, మహిళా సంఘాలు బాధితురాలి కుటుంబానికి మద్దతుగా నిలిచాయి. ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి, మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రేమోన్మాది దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దాడిపై గిరిజన, స్త్రీశిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎం అధికారులతో మాట్లాడి అనూష ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని తెలిపారు. ప్రేమోన్మాదిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇటు గవర్నర్ తమిళిసై కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనూష ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story