ఇంద్రవెల్లి గడ్డపై దండోరా మోగించబోతున్నాం -రేవంత్‌రెడ్డి

ఇంద్రవెల్లి గడ్డపై దండోరా మోగించబోతున్నాం -రేవంత్‌రెడ్డి
Indervelly Meeting: తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Indervelly Meeting: తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమయ్యే బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. భారీ జనసమీకరణతో సుమారు 18 ఎకరాల స్థలంలో లక్ష మంది వచ్చేలా బహిరంగ సభను నిర్వహించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి గుడిహత్నూర్‌ చేరుకుని యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే జెండా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి బహిరంగ సభకు హాజరవుతారు.

సీఎం కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో దళిత, గిరిజన, వర్గాలకు జరిగిన అన్యాయాన్ని మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దండోరా మోగించబోతున్నామని, తెలంగాణ సమాజమంతా కదిలిరావాలన్నారు. కేసీఆర్‌పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రేవంత్‌.

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ సభ విషయంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌, ఏఐసీసీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మధ్య తలెత్తిన స్వల్ప వివాదం సద్దుమణిగింది. ఆదివారం.... పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి.... రేవంత్‌, మహేశ్వర్‌రెడ్డిలను తన ఇంటికి పిలిపించుకుని సర్ది చెప్పారు. అనంతరం మధ్యాహ్నం మహేశ్వర్‌రెడ్డి నివాసానికి రేవంత్‌రెడ్డి వెళ్లి భోజనం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం సమసిపోయింది.. మరోవైపు వారం రోజులుగా తనకు జ్వరం వస్తోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. దీంతో కోర్టుకు కూడా హాజరు కాలేకపోయానని, వారెంటు కూడా వచ్చిందని అన్నారు. జ్వరం కారణంగానే ఇంద్రవెల్లిలో జరిగే సభకు హాజరు కాలేక పోతున్నానని వివరించారు.

Tags

Next Story