MLC: తీన్మార్‌ మల్లన్న విజయభేరీ

MLC: తీన్మార్‌ మల్లన్న విజయభేరీ
X
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న.... రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేత నిర్ణయించిన అధికారులు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలింది. తీన్మార్‌ మల్లన్న విజయంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. MLA ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో .. గత నెల 27న జరిగిన వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఫలితం తేలింది. ఈనెల 5న ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మూడు రోజులపాటు ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు కోటాకు కావాల్సిన లక్షా 55 వేల 95 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతను నిర్ణయించారు. తీన్మార్‌ మల్లన్నకు R.O హరిచందన గెలుపు ధ్రువపత్రం అందించారు. పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్న తీన్మార్‌ మల్లన్న హర్షం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని చూసిన బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టామని వివరించారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్నకు లక్షా 50 వేల 524 ఓట్లు వచ్చాయి. భారాస అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి లక్షా 35 వేల 802 ఓట్లు పోలయ్యాయి. 48 వేల 772 ఓట్లతో భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌, భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితోపాటు మెుత్తం 50 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని రాకేశ్‌ రెడ్డి అన్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో జూన్ 9వరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని.. ర్యాలీలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని SP చందనా దీప్తి స్పష్టం చేశారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Tags

Next Story