ASSEMBLY: నేటి నుంచి శాసనసభ సమావేశాలు

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేడు నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో నేడు నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా నూతన ఆర్వోఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్తగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లుపైనే ఉన్నది. దీంతోపాటు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తును ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్చే బిల్లును సైతం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖతో అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీక్షించారు.
ఏడు పనిదినాల పాటు సమావేశాలు..
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదు నుంచి ఏడు పని దినాలపాటు కొనసాగే అవకాశం ఉంది. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంగళ, బుధ వారాలు విరామం ఇచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. తొలి రోజు సమావేశానంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో సమావేశాల అజెండాపై స్పష్టత రానుంది. ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ప్రతి మండలంలోనూ కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండేలా నిబంధన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు, ఒకే పర్యాయానికి వర్తింపు వంటి సవరణలు చేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లునూ ఈ సమావేశాల్లోనే చర్చకు పెట్టనున్నారు. జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు, పురపాలక సంఘాలు, జీహెచ్‌ఎంసీ, వస్తు సేవల పన్ను చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు.
వాడీవేడిగా సాగనున్న సభలు
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో హోరాహోరీగానే చర్చ జరిగేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ఈ అంశాలపై సభను వేదికగా చేసుకుని సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర వివరణ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయం లో ఏడాది పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు విడుదల చేసిన బీఆర్‌ఎస్, బీజేపీ. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపైనా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్.. అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాలు, వారిపై ప్రతిదాడికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com