BJP: సత్ఫలితాలు ఇస్తోన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్ఫలితాలనిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలతో పాటు బలమైన ముఖ్య నేతలను తమ గూటికి చేర్చుకోవడంలో కమలదళం విజయవంతమైంది. ఇప్పటికే నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం పదైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్ఠానం సైతం పది సీట్లతో పాటు, 35 శాతం ఓటు బ్యాంకును రాష్ట్రనాయకత్వానికి లక్ష్యంగా పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకంటే ముందుగానే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మోదీ ఛరీష్మాతో పది సీట్లు సునాయసంగా కైవసం చేసుకోవచ్చని భావించిన కమలదళానికి బలమైన అభ్యర్థుల లేమి తలనొప్పిగా మారింది. దీంతో అధికారం కోల్పోయిన భారాస నేతలపై బీజేపీకన్నుపడింది.
బీఆర్‌ఎస్‌లోని బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకోవాలని భావించింది. పార్టీలో బలమైన అభ్యర్థులు లేని నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైంది. బీఆర్‌ఎస్ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌ను కాషాయగూటికి చేర్చుకుని తొలి జాబితాలోనే అభ్యర్థిత్వం ఖరారు చేసి పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌లను కాషాయగూటికి తీసుకొచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు ఈ ఇద్దరితో టచ్‌లోకి వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. భారాస అధినేత కేసీఆర్ మాత్రం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పేరునే ఖరారు చేశారు. దీంతో పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న సీతారాం నాయక్ నివాసానికి బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కిషన్ రెడ్డి ఆహ్వానంపై సీతారాం నాయక్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. సీతారాం నాయక్ భాజపాలో చేరితే మహాబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన్ను బరిలో దింపనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావ్... ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కొత్తగూడెంలో పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉన్న జలగం వెంకట్రావు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో భేటీ అయినట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంకట్రావుకు ఖమ్మం టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com