TG: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?

TG: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?
కొత్త మంత్రులుగా ఎవరికి అవకాశం.... ఉత్కంఠగా మారిన కేబినేట్‌ విస్తరణ

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో కీలక నేతలకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలు ముగిసి పాలనపై దృష్టి సారించిన రేవంత్‌రెడ్డి త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించి పాలనపై మరింత పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానంతో రేవంత్‌రెడ్డి చర్చించారని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్‌ నాయకులు, ముఖ్యులు, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు భారాసను వీడి హస్తం పార్టీలో చేరారు. మరికొందరు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి ఎవరికి మంత్రివర్గంలో స్థానం ఇస్తారని ఆసక్తిగా మారింది. మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం నలుగురికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.

వీరికేనా...?

మంత్రివర్గ విస్తరణలో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం కల్పించేందుకు శ్రీహరిని మంత్రిగా చేస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డం వివేక్‌ల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నా... రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ, ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్‌ఛార్జిగా వ్యవహరించడం లాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ పేరు సైతం వినిపిస్తోంది. పార్టీలో చేరేముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది.

వివేక్‌ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. వివేక్‌ సోదరుడు గడ్డం వినోద్‌ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమసాగర్‌రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వివేక్‌ లేదా ప్రేమసాగర్‌రావులలో ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సీనియర్‌ నాయకుడు, బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించినా సామాజిక సమీకరణాల్లో చోటు లభించలేదు.ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం.

Tags

Next Story