TG: ఏప్రిల్ తొలి వారంలోనే మంత్రివర్గ విస్తరణ

TG: ఏప్రిల్ తొలి వారంలోనే మంత్రివర్గ విస్తరణ
X
ఏప్రిల్ మూడున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ ప్రచారం... చివరి ప్రయత్నాల్లో నేతలు

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు యేడాదిన్నర కావస్తోంది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి వర్గ విస్తరణ ఇప్పటివరకూ జరగలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి అభిప్రాయాలు సేకరించింది.

రేవంత్ వద్దే కీలక శాఖలు

హోం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, విద్య, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కీలక శాఖలను రేవంత్‌ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఉగాది తర్వాత ఒకటి రెండ్రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని చెబుతున్నారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్‌తో పాటు పార్లమెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం వాకిట శ్రీహ‌రి ముదిరాజ్‌కు బెర్తులు క‌న్ఫామ్ అయ్యాయని అంటున్నారు. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రెడ్డి కోటాలో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండగా.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్‌, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్యకు కూడా అవకాశం దక్కుతుందని అంటున్నారు.

మంత్రుల పోర్ట్ ఫోలియోలు కూడా మారుస్తారా?

మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌తో పాటు ప‌నితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్ ఫోలియోలు కూడా మారుస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న శాఖ‌ల‌తో పాటు సీఎం దగ్గరున్న శాఖ‌ల‌ను కేటాయించే విష‌యంపై కూడా అధిష్టానం దగ్గర చ‌ర్చ జ‌రిగింద‌ట‌. సీనియ‌ర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త‌న దగ్గరున్న శాఖ‌ల‌లో మార్పు చేయాల‌ని కోరుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాబినెట్ విస్తర‌ణ తుదిద‌శ‌కు చేరుకోవడంతో ఎవ‌రి ప్రయ‌త్నాలు వారు చేస్తున్నారు. క్లైమాక్స్‌లో ఛాన్స్ కొట్టేసేందుకు కొంద‌రు ట్రై చేస్తుంటే.. మంత్రిగా బెర్త్‌ క‌న్ఫామ్ అయినవారు శాఖ‌ల‌పై దృష్టి పెట్టారు. మ‌రోవైపు సీనియర్ మంత్రులు కూడా త‌మ శాఖ‌ల‌ను మార్పులు కోరుతున్నారు.

Tags

Next Story