TG: ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ భేటీ

TG: ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ భేటీ
X
పునర్విభజన అంశాలపై కేబినెట్ లో చర్చ... రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ

ఈనెల 18న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న పునర్విభజన అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం నిర్ణయించారు. జూన్ 2తో రాష్ట్రం ఏర్పడిన పదేళ్లు పూర్తి కానున్నందన.. పునర్విభజన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి.. పెండింగులో ఉన్న అంశాలు, తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

షెడ్యూలు 9, 10లో ఉన్న సంస్థల విభజన పూర్తి కాలేదని... పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అధికారులు వివరించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివాదం తేలలేదని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తదుపరి కార్యచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీ వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య క్లిష్టంగా మారిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పదేళ్లు పూర్తయ్యాక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదు కాబట్టి.. ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతన్న తీరును అడిగి తెలుసుకున్న సీఎం... రైతులకు ఇబ్బంది లేకండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అకాల వర్షాలతో ఇబ్బందులు

తెలంగాణలో అకాల వర్షాలకు అన్ నదాతలు కుదేలౌతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిరసన బాటపట్టారు. కామారెడ్డి జిల్లా, నిజాం సాగర్ మండలం కొమలంచ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు రోడెక్కారు. 5రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ధర్నాకు దిగారు. 40లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందన్న రైతులు వడ్లను F.C.I కేంద్రాలకు తరలించి, 25 రోజులు గడిచినా ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఆరోపించారు. నిర్మల్ జిల్లా మామడ, లక్ష్మణ చందా మండలాల్లో అకాల వర్షాలకు కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలొచ్చె అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తాలు, తేమ పేరుతో అధికారులు వేధిస్తున్నారని.. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ 163వ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో హైదరాబాద్ -వరంగల్ వైపు వెళ్లే వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేదిలేదని రైతు లు తేల్చిచెప్పారు.

Tags

Next Story