TS: రేషన్‌కార్డుల్లో మార్పులకు అవకాశం నిజమేనా

TS: రేషన్‌కార్డుల్లో మార్పులకు అవకాశం నిజమేనా
స్పందించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ... ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని స్పష్టీకరణ...

రేషన్‌ కార్డుల విషయంలో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్న వార్త నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతోంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు కాంగ్రెస్‌ సర్కార్‌ అవకాశం కల్పించిందని ప్రచారం జరిగింది. రేషన్‌ కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేసుకోవచ్చని... కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని.. రేషన్ కార్డుల్లో వివరాలు మార్చుకోవడం, అప్ డేట్ చేసుకోవడానికి ఇదే సదావకాశమని వార్తలు వచ్చాయి. రేషన్ కార్డుల వివరాల సవరణ ప్రక్రియ మొదలైందన్న ప్రచారంపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. తెలంగాణలోని రేషన్ కార్డుల్లో పేర్లు, వివరాల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పింది. రేషన్ కార్డుల ఎడిట్ ఆప్షన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు మీ సేవా కేంద్రాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదన్నారు. సోషల్ మీడియాలో ఎడిట్ ఆప్షన్ విషయం వైరల్ కావడంతో ఎంతో ఆశగా వేలాదిగా రేషన్ కార్డుదారులు మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు.

మరోవైపు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానిపై ప్రకటన చేస్తుందని, తమకు సైతం వివరాలు అందుతాయని చెప్పారు. మరోవైపు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ప్రకటన చేసింది. అయితే పాత వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారా, లేక ఏమైనా సవరణలతో కొత్తవి జారీ చేస్తారన్నది ఇంకా స్పష్టత లేదు.

త్వరలో స్మార్ట్‌ రేషన్‌కార్డులు!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు కొందరైతే, ఉన్న రేషన్ కార్డులో తమ కుటుంబీకుల పేర్లు ఆ కార్డులో జత చేయాలని, అడ్రస్ మార్పు, తదితర సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఆశించినంత వేగంగా రేషన్ కార్డుల జారీ, నిబంధనలు, రేషన్ కార్డు అప్‌డేట్ వంటి పనులన్నీ జరగడం లేదు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల జారీ గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో అసలు రేషన్ కార్డు స్వరూపాన్నే మార్చి వేసి వాటి స్థానంలో కొత్తగా కంప్యూటరైజ్డ్ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అవకతవకలు లేకుండా, అవినీతికి అవకాశం లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అయితే దీనికి ముందు ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, కొత్త రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డుల ప్రక్రియను ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటికి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. కాగా రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డును భద్రపర్చుకోవాలని, వాటిని అప్‌డేట్ చేయించుకోవాలని చూస్తున్నారు.

Tags

Next Story