TS: కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైంది

TS: కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైంది
తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్‌ఎస్‌ కూల్చేసిందన్న రేవంత్‌.... మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ సందర్శణ..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని తెలంగాణ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. మొదట అసెంబ్లీలో ఈ అంశంపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కాంగ్రెస్ , CPI, MIM ఎమ్మెల్యేలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ వెళ్లారు. బ్యారేజీలో పగుళ్లు, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు...... వారికి అక్కడి పరిస్థితులను వివరించారు. అనంతరం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు. నీటిపారుదల శాఖ ఇంఛార్జ్‌ చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌ రెడ్డి..ప్రాజెక్టు నిర్మాణం తీరు, ఖర్చు, ఇతర వివరాలను తెలియజేశారు. విజిలెన్స్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మేడిగడ్డ కుంగుబాటు....., అనంతరం విజిలెన్స్‌ విభాగం విచారణలో గుర్తించిన అంశాలు..., లోపాలను వివరించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత భారీ కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.


మేడిగడ్డపై సీబీఐ విచారణ జరిపించాలన్న బీజేపీ నేతలపై సీఎం రేవంత్‌ మండిపడ్డారు. న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లను తొలగించామన్న ఆయన కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోందని, అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తామని తెలిపారు. తన అవినీతి బండారం బయటపడుతుందనే....... కేసీఆర్ సభకు రావడం లేదన్న రేవంత్, నేడైనా వచ్చి ప్రాజెక్టులపై చర్చలో మాట్లాడాలన్నారు.


సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై తమ ప్రభుత్వ నిర్ణయం చెబుతామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హడావుడిగా ముందుకెళ్తే కేసీఆర్‌ చేసినట్లే అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. లక్ష ఎకరాలకు నీరు అందక పోయినా.. కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ.. సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్‌ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారు. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్‌ పదే పదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని రేవంత్ భగ్గుమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story