TS: గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్‌ అమలుకు ముహూర్తం ఫిక్స్‌

TS: గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్‌ అమలుకు ముహూర్తం ఫిక్స్‌
ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం... విద్యుత్‌కు వచ్చే నెల నుంచి జీరో బిల్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో మరో రెండు పథకాల అమలుకు రంగం సిద్ధమైంది. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్‌ను.... ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్ల రేషన్‌కార్డుదారులు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే, వచ్చే నెల నుంచి జీరో బిల్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు....... 500 రూపాయలు చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతరం స్వీకరించాలని అధికారులకు సీఎం తెలిపారు.


గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను... ఈనెల 27 లేదా 29వ తేదీన ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి గృహ జ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ఆదేశించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండరుపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా ఏజెన్సీలకు చెల్లించాలా.... అనే అంశంపై పౌరసరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో సీఎం చర్చించారు. ఎలా చేసినప్పటికీ.. లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేలా అనువైన విధానాన్ని రూపొందించాలని అధికారులకు చెప్పారు.


అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. సబ్సిడీ నిధులను గ్యాస్ ఏజెన్సీలకు, వెంట వెంటనే చెల్లించేలా.. ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకాన్ని ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా.. పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను... సీఎం ఆదేశించారు. తెల్ల రేషన్‌కార్డు ఉండి 200 యూనిట్లలోపు.... గృహ విద్యుత్‌ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే నెలలో అర్హులకు గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులే ఇవ్వాలని తెలిపారు. ప్రజా పాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో.. రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ నంబరు తప్పుంటే సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు.విద్యుత్‌ బిల్లు వసూలు కేంద్రాలు, సేవా కేంద్రాల్లో సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. తప్పులను సవరించుకున్న తర్వాత నెల నుంచి పథకం వర్తింపజేయాలని. స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్న సీఎం... గతంలో దరఖాస్తు చేయని వారి నుంచి ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story