CONGRESS: భారీ ఎత్తున విజయోత్సవ సభ

CONGRESS: భారీ ఎత్తున విజయోత్సవ సభ
ఈనెలాఖరులో నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు... రాహుల్‌, ఖర్గేలతో చర్చించనున్న రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ విజయోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ విజయోత్సవ సభను నిర్వహించే అంశంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వచ్చారు. 2022 మే 6న వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ రూ.2 లక్షల రైతు రుణమాఫీని ప్రకటించింది. దాన్ని అమలు చేసినందుకు గుర్తుగా అక్కడే వచ్చే నెలాఖరులో భారీ బహిరంగసభ నిర్వహించి మాట నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. దీనిపై రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించి తేదీ నిర్ణయించాలన్న భావనతో ఉన్నారు. నిన్న మధ్యాహ్నమే ఢిల్లీ చేరుకున్న రేవంత్‌రెడ్డి రాత్రి 9 గంటలవరకూ పార్టీనేతలెవర్నీ కలవలేదు. ఇవాళ రాహుల్‌, ఖర్గేలతో చర్చించిన అనంతరం రేవంత్‌ హైదరాబాద్‌ తిరుగుపయనమవుతారు.

ఢిల్లీలో సమీక్ష

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ చర్చలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి రాహుల్‌బొజ్జా, జలవనరుల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌లతో చర్చించారు. ఒకవైపు మేడిగడ్డ మరమ్మతులు, పరీక్షలపై ఎన్‌డీఎస్‌ఏతో చర్చలు, మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రాజెక్టు పరిస్థితులను లోతుగా సమీక్షించారు. ఎన్‌డీఎస్‌ఏ వద్ద జరిగిన సమీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మరోసారి ఇంజినీర్లు, నిపుణులతో నిర్వహించే సమావేశంలో చర్చకు రాబోయే అంశాల గురించి ఆరా తీశారు. మంత్రి ఉత్తమ్‌ తాజా స్థితిగతుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలు, రావాల్సిన ఫలితాల గురించి తెలిపారు. సోమవారం జరగబోయే ఇంజినీర్ల స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఒక స్పష్టత వస్తుందని, దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

Tags

Next Story