REVANTH-MODI MEET: సంపూర్ణ సహకారం అందించండి

REVANTH-MODI MEET: సంపూర్ణ సహకారం అందించండి
ప్రధాని మోదీ, హోంమంతి అమిత్‌ షాకు రేవంత్‌ వినతి... సానుకూల స్పందన వచ్చిందన్న ముఖ్యమంత్రి

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను కలిశామని రేవంత్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చామని.. ఆ వినతి పత్రాలకు మోదీ, అమిత్‌ షా నుంచి సానుకూల స్పందన కన్పించిందని తెలిపారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఫలానా తేదీన చేపడతామని తాను ఎప్పుడూ చెప్పలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం గురించి ఏఐసీసీ అధ్యక్షుడికి చెప్పామని, ఈ రెండు విషయాలు ఖర్గే పరిశీలనలో ఉన్నాయని మాత్రమే ఇదివరకు తాను అన్నట్లు పేర్కొన్నారు.


సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్‌ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడి లోక కల్యాణ్‌ మార్గ్‌లో సీఎం ప్రధానమంత్రి మోదీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్‌ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై ప్రధానితో సీఎం చర్చించారు. అంతక్రితం హోంమంత్రి అమతిషాను కలిశారు.

2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం మంజూరు చేసిందని.. 2014 తర్వాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని రేవంత్‌ మోదీని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో తగినంత భూమి అందుబాటులో ఉన్నందున అక్కడ ఐఐఎం ఏర్పాటుచేయాలి. అక్కడ కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేస్తామన్నా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు కొత్తగా 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కోచ్‌ తయారీ కేంద్రానికి బదులు ఇక్కడ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్‌ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం దాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం భావ్యంకాదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేయాలన్నారు.

Tags

Next Story