TG: రైతులను వంచించిన కాంగ్రెస్‌ సర్కార్‌

TG: రైతులను వంచించిన కాంగ్రెస్‌ సర్కార్‌
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆగ్రహం... నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు

తెలంగాణ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వంచించిందని..బీఆర్‌ఎస్‌ అధినేత KCR ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలు వరికి 500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం..... ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్న KCR.... ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. డబ్బాలో ఓట్లు పడగానే..కాంగ్రెస్‌కు రైతుల అవసరం తీరిందని మండిపడ్డారు. రైతుల హక్కులు, హామీల సాధన కోసం రాష్ట్రవ్యాప్త నిరసన చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలన్న గులాబీ దళపతి... రైతులకు భరోసా కల్పించేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిరోజూ వడ్ల కళ్లాల వద్దకు వెళ్లాలని... రైతుల హక్కులు కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. రేపు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నాయి.


అకాల వర్షం-అపార నష్టం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని ముంచింది. చేతికందొచ్చిన పంట నీటిపాలయ్యింది. అమ్మేందుకు సిద్దంగా ఉంచిన పంట... కళ్లముందే నీళ్లల్లో కొట్టుకుపోతుంటే...ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాని దీనస్థితి. అప్పుల కుప్పలు పెరిగినా... పంట సాగు చేస్తున్నామని...అకాల వర్షాలతో కన్నీరే మిగిలిందని వరంగల్‌ జిల్లాలోని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికూల వాతావరణం..పకృతి వైపరీత్యాలతో ఆరుగాలం కష్టించే రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రబీ పంట ఇంట్లో సిరులు పండిస్తుందని గంపెడాశతో అప్పులు చేసి పంట సాగు చేస్తే చేతికందకుండా పోయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు వందల ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఎండ తీవ్రత వల్ల చెరువుల నీరు కాలువలకు అందక పోవడంతో ఇంజన్ల ద్వారా నీటిని ఎత్తి పోసి పంటలు పండిస్తే...వడగండ్ల వానకు పంట నేలరాలింది

నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలోని గ్రామాల్లో కోతకోసి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంట సైతం... వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయిందని ఆవేదన చెందుతున్నారు. వాటిని ప్రభుత్వమే మద్దతు ధరకు కొని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వడగండ్ల వానకి మేడపల్లి రాంపూర్ జంట గ్రామాల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో రాత్రంతా విద్యుత్తుకు అంతరాయం కలిగింది. వడగండ్ల వానకు రాసమల్ల లక్ష్మీ అనే మహిళ ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దెబ్బతిన్నాయని తమకు నిలువనీడ లేకుండా పోయిందని వాపోయింది. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించింది.

Tags

Read MoreRead Less
Next Story