TS: తెలంగాణలోనూ ఓట్ ఆన్ ఆకౌంటే..!

ఫిబ్రవరి రెండోవారంలో బడ్జెట్ సమావేశంలో నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఓట‌్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నందున తెలంగాణలో అదే రీతిలో ముందుకెళ్లాలని యోచిస్తోంది. కుల గణన చేయాలని భావిస్తున్న సర్కార్ ఆ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కసరత్తు చేస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చేనెల రెండో వారంలో నిర్వహించడానికి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం ‘ఓట్ ఆన్ అకౌంట్’బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తెలంగాణలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేదా ‘ఓట్ ఆన్ అకౌంట్’ ప్రవేశపెట్టాలా? అని..... రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను... కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓట్‌ఆన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండక పోవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఎప్పుడైనా విడుదలకావచ్చనే ప్రచారం జరుగుతుండడంతో ఆలోపే బడ్జెట్ సమావేశాలను ముగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే వార్షికపద్దు రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో.. ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నిశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కులగణనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. వచ్చేబడ్జెట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లుపెట్టాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో జనగణన చేసినప్పుడు కులాలవారీగా లెక్కలు తీసింది. ఆ తర్వాత మళ్లీకులాలవారీగా లెక్కలు తీయలేదు. బడుగు బలహీనవర్గాల మేలు కోసం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కులగణనను సత్వరంగా చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన మేరకు కులగణన చేసేందుకు కృతనిశ్చయంతో ఉండడంతో.. సంబంధిత బిల్లుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలనుబీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పగించారు. గతేడాది బీహార్ సర్కారు రెండు దఫాలుగా కులగణన సర్వేచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com