GROUP1: గ్రూప్ వన్ జరిగేనా.. వాయిదా పడేనా..?

తెలంగాణలో గ్రూప్ 1 పంచాయతీ మళ్లీ హైకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలైంది. ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. సింగిల్ బెంచ్ తీర్పును ముగ్గురు అభ్యర్థులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసింది. రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని అధికారులు ప్రకటించారు. సింగిల్ బెంచ్ తీర్పు వచ్చిన రెండ్రోజుల తర్వాత అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కారు.
అభ్యర్థుల ఆందోళనలు..
జీవో 29 రద్దుతోపాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సంబంధిత అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌లో మరోసారి ధర్నా చేపట్టారు. అభ్యర్థులకు తోడుగా నిరుద్యోగులూ తరలిరావడంతో పార్కు కిక్కిరిసిపోయింది. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31 వేల మంది వరకు క్వాలిఫై అయితే.. 34 వేల మందిని మెయిన్స్ పరీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్-1పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లను పరిశీలించాలి: కేటీఆర్
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలన్న అభ్యర్ధుల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరీశీలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలంటూ అశోక్‌నగర్‌లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాని ఆయన డిమాండ్ చేశారు.
పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి గురువారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏ విధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com