TG: తెలంగాణలో కొత్త బ్రాండ్ల విషయంలో గందరగోళం
తెలంగాణ రాష్ట్రంలో మద్యం కొత్త బ్రాండ్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కానీ ఆ శాఖ కమిషనర్ శ్రీధర్ మాత్రం... గడిచిన ఐదు నెలల్లో నాలుగు బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలో మద్యం విక్రయాలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 30లక్షల59 వేల కేసులు లిక్కర్ అమ్ముడుపోగా.. 50లక్షల14 వేల కేసులు బీరు విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు దాదాపు రెండు లక్షల కేసులు బీరు అమ్ముడు పోతోంది. తెలంగాణలో ఆరు బ్రూవరీలు ఉండగా వాటి ద్వారా రోజుకు రెండు లక్షల కేసులు బీరు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటిన్ నగరమైనందున వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వ్యాపార వాణిజ్య, పర్యాటక తదితర అవసరాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సాధారణంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బీరు వినియోగం ఎక్కువ అవుతోంది. ప్రతి ఏడాది వేసవిలో...బీరుకు డిమాండ్ మరింత పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా బఫర్ స్టాకు పెట్టేందుకు అబ్కారీ శాఖ ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
తెలంగాణలో ఆరు బ్రూవరీల్లో నాలుగు బ్రూవరీలు తయారు చేస్తున్న పాపులర్ బ్రాండ్లు మొత్తం మార్కెట్‌లో 95 శాతం వాటా ఉండగా మిగిలిన బ్రాండ్ల అమ్మకాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. బ్రాండ్ పేరు మోజుతో కొన్ని బ్రాండ్ల బీరు అమ్మకాలు అత్యధికంగా జరగడం సర్వసాధారణం. మే నెలలో ఎండ వేడి అధికంగా ఉండడంతో బీర్ల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. అయితే బ్రూవరీలు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. ఇందులో నాలుగు పాపులర్ బ్రాండ్లు తయారు చేసే బ్రూవరీలకు మూడు షిఫ్టులల్లో పని చేసేందుకు ఆబ్కారీ శాఖ అవకాశం కల్పించింది. వాటి ద్వారా రోజుకు దాదాపు 5 లక్షల కేసులు ఉత్పత్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ బ్రూవరీలు కేవలం రెండున్నర లక్షల కేసులు బీరు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బీరు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీరు సరఫరా చేసేందుకు బయట రాష్ట్రాల నుంచి ఆసక్తి చూపుతున్న నాలుగు కొత్త బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పోరేషన్ అనుమతి ఇచ్చింది. ఆయా బ్రూవరీలు బెవరేజెస్ కార్పోరేషన్‌తో ధర విషయంలో ఒప్పందం చేసుకుంటాయి. ఆ మేరకు నిర్దేశించిన ధరకే ఆయా బ్రూవరీలు రాష్ట్రానికి బీర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఎక్సైజ్ శాఖలో జరిగే కీలక నిర్ణయాల్ని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ మంత్రికి అన్ని విషయాలు తెలియ చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇందువల్లనే ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్క బ్రాండ్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. కానీ అప్పటికే బెవరేజెస్ కార్పోరేషన్ నాలుగు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చింది. ఈ విషయం మంత్రి జూపల్లి దృష్టికి వెళ్లలేదు. ఆయన మీడియాతో మాట్లాడే ముందు అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ప్రకటన విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్... బ్రాండ్లకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఉత్పత్తి చేస్తారన్న నమ్మకం ఉండదని...వారి నుంచి దిగుమతి వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంటుందని వివరించారు . మంత్రి, ఎక్సైజ్ కమిషనర్ …ఇద్దరూ వేర్వేరు వివరాలు వెల్లడించడంతో వారి మధ్య సమన్వయం లేదన్న వాదన వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com