TG: కేంద్రానికి భట్టి విక్రమార్క పలు డిమాండ్లు

TG: కేంద్రానికి భట్టి విక్రమార్క పలు డిమాండ్లు
నిధుల విడుదలకు నిర్దిష్ట విధానాన్ని పాటించాలన్న తెలంగాణ ఆర్థిక మంత్రి... మూసీ అభివృద్ధి పథకానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడం లేదని... రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో విడుదల చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్‌ సన్నద్ధత సమావేశం... జీఎస్టీ మండలి సమావేశంలో భట్టి పాల్గొన్నారు. తెలంగాణ తరఫున డిమాండ్లను వినిపించారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు తగ్గుతున్న వాటాను భర్తీ చేయాలంటే సెస్సులు, సర్‌ఛార్జీల గరిష్ఠ పరిమితిని 10శాతానికి పరిమితం చేయాలని భట్టి కోరారు. రాష్ట్రాలకు ఏటా అనుమతి ఇచ్చే నికర రుణ పరిమితి వివరాలను బడ్జెట్‌కు ముందే స్పష్టంగా తెలియజేయాలని దానివల్ల రాష్ట్రాలు బడ్జెట్‌ను కచ్చితంగా రూపొందించుకోవడానికి వీలవుతుందన్నారు.

మూసీ అభివృద్ధి పథకానికి నిధులు ఇవ్వాలని ఈ కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో భట్టి కేంద్రాన్ని కోరారు. కేంద్ర బడ్జెట్ తయారీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల బకాయిలు ఇవ్వడంతో పాటు మరో ఐదేళ్లు కొనసాగించాలని, జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమయంలో రుణ పరిమితి సీలింగ్‌ను ఖరారు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందుతుందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి కొన్ని అంశాలను స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు.

దేశం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఆదాయ పంపిణీలో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం కాబట్టి ఆదాయాన్ని న్యాయబద్ధంగా పంపిణీచేసి సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇంకా రూ.2,250 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని విడుదల చేయడంతోపాటు, ఈ గ్రాంట్‌ వ్యవధిని మరో ఐదేళ్లు పొడిగించాలన్నారు.

Tags

Next Story