TS: మయోనైజ్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చల అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్తీ ఆహారం తిని అనారోగ్యం బారిన పడుతున్న క్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పుడ్ వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన కమిటీల పనితీరుపై ఆరా తీశారు. వివిధ రకాల ఫుడ్ తో మయోనైజ్‌ను తయారు చేస్తున్నారని అధికారులు మంత్రికి చెప్పారు.
అసలెంటీ ఈ మయోనైజ్
మయోనైజ్ ఎక్కువగా బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్, ఇతర ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకొని తినే ఆహార పదార్థం. మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఉడికించని పదార్థం కాబట్టి మయోనైజ్‌లో హానికర బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ మయోనైజ్ కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హోటళ్లు తీరు మార్చుకోకపోవడంతో ఫుడ్ సేఫ్టీ విభాగం రంగంలోకి దిగి నిషేధం విధించాలని నిర్ణయించింది. బంజారాహిల్స్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో మయోనైజ్‌ను తిన్నవారు అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని పలు హోటళ్లలో దాడుల సమయంలోనూ నాసిరకం మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు. అదేవిధంగా, సికింద్రాబాద్, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్ల పైనా బల్దియాకు ఫిర్యాదులు అందాయి.
మోమోస్ తిని మహిళ మృతి
బంజారాహిల్స్ నందినగర్.. సింగాడికుంటలో అక్టోబర్ 27న వీకెండ్ ఏర్పాటు చేసిన సంతకు రేష్మ బేగం అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లింది. మోమోస్‌తో మయోనీస్ కలిపి తిన్నది. కొద్దిసేపటికే ఆమెకు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 27న చనిపోయింది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ పరిధిలో ఇటీవల మోమోస్ తో తిన్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు వీళ్లంతా కడుపునొప్పి, విరేచనాలతో పద్మారావునగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. రెండ్రోజులు ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ అస్వస్థతకు గురవడంతో సోమవారం కవాడిగూడలోని మరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com