Tribal University: గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయింపు

గిరిజనులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాన్నుది. ములుగు కేంద్రంగా ఏర్పాటయ్యే యూనివర్సిటీ రాష్ర్టానికే తలమానికం కానుంది. ఉమ్మడి రాష్ట్రం విభజన చట్టమైన సెక్షన్ 93 షెడ్యూల్13(3) ప్రకారం తెలంగాణకు వచ్చిన గిరిజన యూనివర్సిటీ అన్ని విధాలా సౌలభ్యంగా, సౌకర్యంగా ఉన్న ములుగు ప్రాంతంలో ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ సెలక్ట్ చేసింది. ములుగులో 221 ఎకరాలు ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 26న జరిగే క్యాబినేట్ లో తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత సదరు భూమి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్ లోని సమస్యకు చెక్ పడనున్నది.
ఇక వేగవంతంగా పనులు..
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం గత కొన్నేళ్ల నుంచి స్థలం కేటాయించలేదనే కారణంతో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆలస్యమైందని కేంద్రం చెప్తూ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క నేతృత్వంలో వివిధ దశల్లో సుదీర్ఘంగా అధ్యయనం తర్వాత స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఈ భూమి కేటాయింపును ఫైనల్ చేశారు. వాస్తవానికి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం అవుతుందని గతంలో కేంద్రం పేర్కొన్నది. అయితే ఒకే చోట అంత అన్ని ఎకరాల భూమి సమకూర్చడం కష్టమని, రెండు చోట్ల కేటాయించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దీనికి చాలా ఏళ్ల తర్వాత అంగీకరించిన కేంద్రం, తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు రెడీ అయింది.
ములుగుకు గుర్తింపు
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. ఇప్పుడు దేశంలోనే అతిపెద గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుండడంతో ములుగుకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌టంక్ జిల్లాలో మొదటి గిరిజన యూనివర్సిటీని రూ.1100కోట్లతో నెలకొల్పారు. రెండోది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైంది. అంతకు మించిన వ్యయంతో మూడో యూనివర్సిటీ ములుగులో ఏర్పాటు కానుంది. గట్టమ్మ ఆలయం పరిసరాల్లో 163 జాతీయ రహదారికి ఆనుకొని యూనివర్సిటీ ఏర్పాటు కానుండడంతో రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, సిబ్బంది వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి గంటలో ములుగుకు చేరుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com