Telangana: అగ్గిరాజుకుంటున్న అవిశ్వాస తీర్మానాలు

Telangana: అగ్గిరాజుకుంటున్న అవిశ్వాస తీర్మానాలు
డిమాండ్లు సాధించుకోవడంపై దృష్టి పెట్టిన కౌన్సిలర్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాలు ఎక్కువైతోన్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తికావడంతో అసంతృప్తులు అవిశ్వాసాలకు పదునుపెడుతున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు తమ డిమాండ్లు సాధించుకోవడంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండడం, 2020 జనవరి 27వ తేదీన కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో చాలాచోట్ల అసంతృప్తులు అధికమయ్యాయి. పురపాలక చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర పడకపోవడం అధికార బీఆర్‌ఎస్‌కు సంకటంగా మారింది.

ఎన్నికల వేళ ఛైర్‌పర్సన్‌ పదవులు దక్కకపోవటంతో పార్టీ నేతలు, ఎమ్మెల్యేల బుజ్జగింపులతో కొందరు, మూడేళ్ల తర్వాత ఛైర్మన్‌ పదవి ఇస్తామన్న హామీలతో ఆశావహులు అప్పట్లో వెనక్కి తగ్గారు. మూడేళ్ల కాలపరిమితి 27తో ముగియడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా అవిశ్వాసాల గళమెత్తుతున్నారు. కొన్ని జిల్లాలో అవిశ్వాసం కోసం నోటీస్‌లు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్ మేయర్, రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ జిల్లా తాండూర్ వికారాబాద్ తదితర పట్టణాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లపై అవిశ్వాసం కోసం కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు.


మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్‌ మేకల కావ్య సహా 28 మంది కార్పొరేటర్లుండగా మేయర్‌ తీరుపై డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ నేతృత్వంలో 20 మంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెప్పిన పనులనే చేస్తున్నారని, సొంత డివిజన్‌లో కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించారని ఆరోపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోవడం లేదంటూ రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అసమ్మతి ఛైర్‌పర్సన్‌ చెవుల స్వప్నాచిరంజీవి, వైస్‌ ఛైర్‌పర్సన్‌ చామ సంపూర్ణ విజయశేఖర్‌రెడ్డిలపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.అలాగే ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతిపై అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఈ పురపాలక సంఘంలో మొత్తం 24 మంది కౌన్సిలర్లుండగా 21 మంది అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఛైర్‌పర్సన్‌ స్రవంతిపై అవినీతి ఆరోపణలున్నాయని, పురపాలక సంఘం వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారని వైస్‌ఛైర్మన్‌ ఆకుల యాదగిరి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

ఇక వికారాబాద్‌ జిల్లా తాండూరు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ స్వప్నపై అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వైస్‌ఛైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీప,ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి మొత్తం 24 మంది కలెక్టర్‌ నిఖిలకు అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేశారు. ఈ మున్సిపాలిటీలో ముందస్తు ఒప్పందం ప్రకారం స్వప్న, దీపలు రెండున్నరేళ్ల చొప్పున పదవిలో కొనసాగాలి. ఈ గడువు గత ఏడాది జులై 27తో ముగిసినా పదవి నుంచి వైదొలగేందుకు స్వప్న ససేమిరా అన్నారు. దీంతో అధ్యక్షురాలు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గంగా, ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి వర్గంగా విడిపోయారన్న విమర్శలు ఉన్నాయి.

ఇవే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని పురపాలికల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. ‌అవిశ్వాసంబాట పట్టిన వారిని బుజ్జగించడం, సర్దుబాటు చేయడం కత్తిమీద సాముగా మారింది.

Tags

Next Story