Telangana: నల్లగొండ మునిసిపాలిటీల్లో ముసలం

Telangana: నల్లగొండ మునిసిపాలిటీల్లో ముసలం
జగిత్యాలలో మొదలైన రగడ రాష్ట్రమంతా వ్యాప్తి

బీఆర్‌ఎస్‌లో అవిశ్వాస రాజకీయాల లొల్లి కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలం అవిశ్వాసాల దిశగా సాగుతోంది. జగిత్యాలలో మొదలైన రగడ రాష్ట్రమంతా పాకింది. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చారు. చండూరు మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్లపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఐదుగురు కౌన్సిలర్లు వినతి పత్రం ఇచ్చారు. అవిశ్వాసం కోరిన కౌన్సిలర్లలో ఇద్దరు బీఆర్‌ఎస్‌కు చెందిన వారు కాగా మరో ఇద్దరు బీజేపీ,ఒక కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఉన్నారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు. ప్రస్తుతం కొనసాగుతున్న చైర్‌ పర్సన్‌ బీఆర్‌ఎస్‌లో ఉండగా వైస్‌ చైర్‌ పర్సన్‌ బీజేపీలో ఉన్నారు.

ఇక యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోనూ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌పై 11 మంది కౌన్సిలర్లు అవిశ్వా సతీర్మానం పెట్టారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా 11 మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. గత కొంత కాలంగా మున్సిపల్‌ చైర్మన్‌పై కౌన్సిలర్లు అసమ్మతితో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం గడువు మూడేళ్లు ముగియడంతో జిల్లా కలెక్టర్‌కు మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానం పత్రాన్ని అందజేశారు.

అటు యాదాద్రి జిల్లాలోని ఆలేరు మున్సిపాలిటీలోనూ అవిశ్వాస తీర్మానాల రచ్చ నడుస్తోంది. చైర్మన్‌పై అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు కదులుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ శంకరయ్యపై సొంత పార్టీ కౌన్సిలర్లతోపాటు, ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడా తిగరుబాటు బావుటా ఎగురవేశారు. అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్‌కు పది మంది కౌన్సిలర్లు వినతిపత్రం అందించారు.

Tags

Next Story