Telangana: నేటి నుంచి మన ఊరు-మనబడి

Telangana: నేటి నుంచి మన ఊరు-మనబడి
రాష్ట్రవ్యాప్తంగా 680 పాఠశాలల్లో ఘనంగా ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ( బుధవారం) మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మన ఊరు-మనబడి రాష్ట్రవ్యాప్తంగా 680 పాఠశాలల్లో ఘనంగా ప్రారంభం కానుంది. తొలి విడతలో రాష్ట్రంలోని 9 వేల 123 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. 3 వేల 497 కోట్లతో 12 రకాల సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మార్చి నెలలో సీఎం కేసీఆర్ వనపర్తిలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో మండలానికి కనీసం రెండు చొప్పున 12 వందల 10 పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలలుగా అధికారులు ఆయా పాఠశాలల్లో శరవేగంగా పనులు పూర్తి చేశారు. 680 పాఠశాలలు సిద్ధం కావడంతో ఇవాళ ఒకేసారి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, మరమ్మతులు చేపట్టారు. అలాగే డిజిటల్‌ విద్య అందించేందుకు పరికరాలు, ప్రహరీలు, వంట గది, డ్యూయల్‌ డెస్కులను సిద్ధం చేశారు. ఉన్నత పాఠశాలలైతే భోజనశాలలు సహా 12 రకాల సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. త్వరలో మరో 600 పాఠశాలలను ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ నుంచి పీజీ విద్యాప్రాంగణాన్ని అద్భుతంగా రూపొందించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ జతచేశారు.

Tags

Next Story