Telangana: ఏడు ప్రాధాన్యతా రంగాలన్నారు.. అసలు రంగాలను గాలికి వదిలేశారు

Telangana: ఏడు ప్రాధాన్యతా రంగాలన్నారు.. అసలు రంగాలను గాలికి వదిలేశారు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతులకు, పేదలకు వ్యతిరేకం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతులకు, పేదలకు వ్యతిరేకమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అందమైన మాటలు తప్ప నిధుల కేటాయింపులో అంతా డొల్లేనన్నారు. ఏడు ప్రాధాన్యతా రంగాలన్నారు, అసలు రంగాలను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్‌ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేశారని హరీష్‌రావు మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కచ్‌ ఫ్యాక్టరీ గురించి ఊసే లేదన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూ మంత్రమేనన్నారు. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు కానీ, ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ చేయలేదన్నారు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకమార్లు కోరామని కానీ, ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదన్నారు. ఈ బడ్జెట్‌లో కూడా ఇస్తామన్నది ఏమీ లేదన్నారు. బడ్జెట్‌లో రైతులకు సంబంధించి నిధుల్లో భారీగా కోత పెట్టారని హరీష్‌రావు మండిపడ్డారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారని, గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారని ధ్వజమెత్తారు. కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పలేదన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా లేవన్నారు.

Tags

Read MoreRead Less
Next Story