Telangana: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దూకుడు

Telangana: ఎమ్మెల్యేలకు ఎర  కేసులో సీబీఐ దూకుడు
ఈనెల 17న సుప్రీంకోర్టులో విచారణ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్‌ కేంద్రంగానే దర్యాప్తు కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణ ఈనెల 17న జరగనుంది. ఈ క్రమంలోనే కేసు వివరాలను సమర్పించాలని రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ డైరెక్టర్‌ దిల్లీ విభాగానికి అప్పగించారు. అందుకే దిల్లీ సీబీఐ విభాగం ఎస్పీ సుమన్‌కుమార్‌ పేరిట ఈ లేఖ ఉంది. అయితే దర్యాప్తు బృందం మాత్రం హైదరాబాద్‌లోనే మకాం వేసింది. హైదరాబాద్‌ కోఠి కేంద్రీయ సదన్‌లోని సీబీఐ కార్యాలయంలోనే శిబిరం ఏర్పాటు చేసుకుంది.

ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను రద్దు చేస్తూ ఈ బాధ్యతను సీబీఐకు ఇస్తూ హైకోర్టు సింగిల్‌జడ్జి బెంచ్‌ తీర్పు వెలువరించిన నేపథ్యంలో గత డిసెంబరు31న సీబీఐ తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్‌ వివరాలు సమర్పించాలని కోరింది. అయితే సింగిల్‌జడ్జి బెంచ్‌ తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సీబీఐ అప్పటికి అలా ఉండిపోయింది. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ లేఖలు వరుసగా రాసింది. అయితే కేసు అప్పీళ్ల కారణంగా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. సుప్రీంకోర్టులో ఈనెల 17న విచారణ జరగనున్న నేపథ్యంలో ఈలోపు సీబీఐ అడిగిన మేరకు రాష్ట్రప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ వివరాల్ని సమర్పిస్తుందా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story