Telangana: సాహితి ఇన్‌ఫ్రాటెక్ ఫిర్యాదులను ఒకటే కేసుగా పరిగణించాలి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నామని.. పెద్దమొత్తంలో అడ్వాన్స్‌లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై అందిన ఫిర్యాదులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదటి ఎఫ్‌ఐఆర్‌ను ప్రధాన కేసుగా పరిగణించాలని, తరువాత దాఖలైన వాటిన్నింటినీ సీఆర్‌పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా తీసుకోవాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించింది.
తమ సంస్థపై అందిన 42కుపైగా ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి, 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సాహితి ఇన్‌ఫ్రా హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ జడ్జి క్రిమినల్ కేసుల పరిధిలో ఉత్తర్వులు జారీ చేసినందువల్ల వాటిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. చట్టప్రకారం, పారదర్శకంగా దర్యాప్తును పూర్తి చేయాలని సీసీఎస్ పోలీసులను ఆదేశిస్తూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది.
సాహితి శర్వాణి ఎలైట్ నిర్మాణాన్ని 2023కల్లా పూర్తి చేస్తామని చెబుతూ సాహితి ఇన్‌ఫ్రా ఫ్లాట్ అమ్మింది. దాదాపు పన్నెండు వందల మంది కష్టమర్ల నుంచి పదిహేను వందల కోట్లు వసూలు చేసింది. అయితే నిర్మాణం చేపట్టకపోవడంతో అడ్వాన్స్ సొమ్ము తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు అనుమతులు రాలేదని , గత 2022 ఫిబ్రవరిలో సొమ్ము వాపసు ఇస్తామని సాహితి ఇన్‌ఫ్రా హామీ ఇచ్చింది. కానీ, చెప్పిన గడువులోగా సొమ్ము ఇవ్వలేదు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులను పలువురు ఆశ్రయించారు. అయితే తమకు పరిధి లేదంటూ కేసు నమోదుకు వారు తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును పలువురు కొనుగోలుదారులు ఆశ్రయించగా. సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com